ఈ మధ్యకాలంలో మనుషులు తమ స్వార్థమునకు తగినట్టుగా పరిస్థితులను సమర్థించుకుంటున్నారు.ఒక హంతకునికి న్యాయమూర్తి మరణశిక్ష విధించాడు.అప్పుడు ఆ హంతకుడు జేబులోని భగవద్గీతను తీసి "చంపింది నేను కాదు,చచ్చినది వాడు కాదు;దీనికీ కృష్ణుడే సాక్షి,ఫలానా శ్లోకం చూడండి"అన్నాడు.జడ్జి కూడా తెలివితక్కువ వాడు కాదు."శిక్ష విధించింది నేను కాదు,చచ్చేది నీవు కాదు-చావు పొమ్మ"న్నాడు.ఆపత్సమయములో ప్రదర్శించే యుక్తి,కుయుక్తులివి.మరియు "చచ్చేది తానూ కాదు.చంపించేది జడ్జి కాదు"అని ఎందుకనుకోరాదు?
అన్ని సమయాలందు సమచిత్తాన్ని అనుభవించాలి.
అవసర అనుకూల విషయాలను మాత్రం తీసుకొని అననుకూల విషయాలను విరుద్ధమైనవిగా భావించుకోవడం సరైన ఆధ్యాత్మికం కాదు.
వేదాంతమంటే ఇది కాదు.మన కర్తవ్యనిర్వహణ మనం చేయాలి.అయితే సర్వము భగవత్ప్రీత్యర్థముగా వదలాలి.జగత్తులో ధర్మము అభివృద్ధి చెందవలేనన్న సద్గుణములే దీనికి పోషకములు."ధర్మదేవతా!నీవీ ప్రపంచములో ఉండకుండాపోవడానికి కారణమేమని"మార్కండేయమహర్షి అడుగగా "దుర్గుణములున్న చోట నిలువ"నని చెప్పింది ధర్మదేవత.సద్గుణములు,సద్భుద్ది,సత్యనిరతి,భక్తి,క్రమశిక్షణ,కర్తవ్యపాలనములను నేర్పేదే సరైన విద్య.ఇవి కల్గిఉండడమే సరైన ఆధ్యాత్మికత.ఈ ఆరే మిత్రషట్కములు.వీటితో స్నేహం చేసుకున్ననాడు జన్మ సార్థకం అవుతుంది.