భగవద్గీత 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్యయోగం లోని 32 వ శ్లోకం గమనించండి.
"మాం హి పార్థ! వ్యపాయేపి స్యుః పాపయోనయః
స్త్రీయో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం!"
అర్థము:
నన్ను(శ్రీకృష్ణున్ని) ఆశ్రయంచినవారు పాపజాతి వారు కానీ,స్త్రీ లైనా కానీ,వైశ్య,శూద్రులైనా కానీ మోక్షం పొందుతారు.
కాని ఈ శ్లోకం చాలా అపార్థాలకు గురైంది.
కారణం దీన్ని " పాపజాతి వారైన స్త్రీలు,వైశ్యులు,శూద్రులు " అని అపార్థం చేసుకొన్నారు.
అంటే స్త్రీలు,వైశ్యులు,శూద్రులు పాపజాతివారని అపార్థం చేసుకొన్నారు.
కొందరు పండితుల అనుకోని అనువాదం వలన వచ్చిన చిక్కు ఇది.
ఆంగ్లంలో మనకు తెలిసిన వ్యాకరణ దోషం వలన అర్థం మారిన "Leave him not hang him" అనేది.
Leave him not,hang him అనగా అతడిని వదలద్దు,ఉరి తీయండి అని.
Leave him,not hang him అనగా వదలండి ,ఉరి తీయవద్దు అని.
చూసారా కేవలం కామా(,) స్థానం మార్పు వలన మారిన అర్థాలు.
క్రింది సుమతి పద్యం గమనించండి.
అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారుటేరును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!
అవసరానికి అప్పిచ్చువాడు. జబ్బు వస్తే చికిత్స చేసేందుకు వైద్యుడు, ఎప్పుడూ ఎండిపోకుండా ప్రవహించే ఏరు, శుభ, అశుభ కార్యాలు చేయించే బ్రాహ్మణుడు ఉండే ఊరిలో మాత్రమే నివసించండి. వీరు లేని ఊళ్లో ఎన్నటికీ
ఉండవద్దు.
ఇక్కడ బద్దెన (సుమతి శతకం వ్రాసినవాడు) ఉద్దేశ్యము ఇలా ఉంటే "అప్పిచ్చువాడు వైద్యుడు" అని మనవారు అపార్థం చేసుకొన్నారు.