తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, September 7, 2009

కాపీ కొట్టినప్పుడు ధైర్యముగా చెప్పుకోండి

శ్రీ రామదాసు చిత్రములో నాగేశ్వరరావు, నాగార్జునల పాట "శుభకరుడు, సురుచిరుడు, భవహరుడు, భగవంతుడెవడు?" అన్న పాట వినే ఉంటారు.
అందులోని చరణాలు కొన్ని:

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తీ..

ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తీ..

ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తీ !

ఏ వేల్పు ఎల్ల వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పూ..

ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పూ..

ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపూ..
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసుల కైమోడ్పూ
!

ఈ పాట వింటుంటే ఎంతో ఆనందము అనుభవించాను.

ఈ మధ్య కాకతాళీయముగా ఒక అన్నమాచార్య సంకీర్తన విన్నాను. అదేమిటంటే
ప : నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం-
స్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు

చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత-
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత-
డేమూర్తి నిజమోక్షమియ్య జాలెడునాత-
డేమూర్తి లోకైకహితుడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాత-
డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము-
డామూర్తి తిరువేంకటాద్రివిభుడు

చ : యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నేదేవుదేహమున నిన్నియును నణగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును
యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవు డీజీవులిన్నింటిలో నుండు
నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవు డవ్యక్తు డేదేవు డద్వంద్వదు-
డాదేవుడీ వేంకటాద్రివిభుడు

చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు
యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము
యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు-
డేవేల్పు భువనైకహితమనోభావకుడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు


అరే ఈ పాట ఎక్కడో విన్నట్టుందే అనుకొంటుంటే శ్రీ రామదాసు చిత్రములోని "శుభకరుడు" పాట గుర్తుకు వచ్చింది. ఈ పాట వ్రాసిన వారు ఈ పాటను అన్నమాచార్య కృతుల నుండి తీసుకొన్నామని చెప్పిఉంటే ఇంకా సంతోషము కలిగిఉండేది. ఆ శృతి(Tuning) కూడా అలానే దింపివేసారు కదా. బాగుంది మంచి పాట అందించారు కాని అన్నమాచార్య కృతుల నుండి తీసుకొన్నామని ,కాస్త మార్పులు చేసి వ్రాశామని చెప్పిఉంటే ఇంకా సంతోషము కలిగిఉండేది.

క్రింద లంకె(link) లో ఆ అన్నమాచార్య కీర్తనను వినండి.

http://www.esnips.com/doc/56a1760e-2a4d-4a9a-b635-6b038b0bd4d9/nityAtmuDaiyumDi-nityuDai

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు