
ఆది శంకరాచార్యుల శిష్యుడైన పద్మపాదుని జీవితములో జరిగిన ఒక సంఘటన.
పద్మపాదులు నరసింహ మంత్రాన్ని ఉపదేశంపొంది దాని జపం కోసం అహోబిల క్షేత్రానికి వెళ్లి అక్కడ అడవిలో జపానికి కూర్చొన్నారు. ఒక ఎరుకవాడు ఆయనను సమీపించి ఎందుకోసంవచ్చారని తాను ఏదైనా చేయగలది ఉందాయని పరామర్శించాడు. తాను నరసింహాన్ని అన్వేషిస్తూ, ఆవనము లోనికి వచ్చినట్లు పద్మపాదులు చెప్పినారు. అట్టి మృగం లేదని ఆ ఎరుకవాడు అన్నాడు. ఉందని పద్మపాదులు అన్నాడు. ధ్యానశ్లోకంలో ఉన్న వర్ణనను ఆ ఎరుకవాడికి చెప్పాడు.
అంతటితో ఎరుకవాడు నరసింహాన్ని వెదకటం సాగించాడు. మరుసటిరోజు సూర్యాస్తమయంలోగా తాను ఆ మృగాన్ని తెచ్చి పద్మపాదులముందు నిలబెటతానని ప్రతిజ్ఞ చేశాడు. ఎంత వెదకినా మృగం కనబడదు. వెదకివెదకి ప్రతిజ్ఞాసమయం దాపురించేసరికి ప్రాణత్యాగం చేసికొందామని ఒక చెట్టుకుఉరిపోసుకుంటాడు.
అంతటితో నరసింహుడు ఆ ఎరుకువానికి ప్రత్యక్షమౌతాడు.
తనకోసం తయారుచేసుకొన్న ఉరిత్రాటితోనే నరసింహస్వామిని పద్మపాదులవద్దకు తీసికొని వెళతాడు. ఆ ఎరుకుధ్యానం రెండురోజులైనా, గాఢతలో చాలాగొప్పది. అందుచేత అతనికి స్వామి స్వరూపదర్శనం కల్గింది. పద్మపాదులకు ఇంకా జపసిద్ధి కాలేదు. అందుచేత అతనికి శబ్దబ్రహ్మస్వరూపంలో (అంటే కనబడకుండా తాను శబ్దం మాత్రం చేస్తూ తన ఉనికిని చెప్పడం) మాత్రం స్వామిగర్జిస్తూ అనుగ్రహించినారు. అవసరమైనప్పుడు ఇంకోసారి తన ఆవేశంలో లోకోత్తరమైన ఉపకారాన్ని చేస్తానని నరసింహస్వామి పద్మపాదులను అనుగ్రహిస్తారు.
శ్రీశంకరులవారిని కాపాలికుడొకడు సంహరించడానికి పూనుకొన్నపుడు వారిని రక్షించే అవకాశంలో నరసింహస్వామి పద్మపాదుడిని పూని కాపాలికుని దేహాన్ని ఛిన్నాభిన్నం చేసినారు.
ఈ ఎరుకువానికి పద్మపాదుల మాటలలో ఒక గొప్ప విశ్వాసం కల్గింది. ఆ విశ్వాసంతో తానుచూడని నరసింహాన్ని వర్ణనప్రకారం వెదకుతూ అఖండమయిన ఏకాగ్రతతో ఎంతోకాలానికి లభించని ధ్యానసిద్ధిని పొందినాడు. ఆ అన్వేషణలో రాగమూ లేదు, భక్తీ లేదు, ద్వేషమూ లేదు. ఒక్క విశ్వాసమూ, ఉపకారచింతనా మాత్రమే.
నరసింహము ఉన్నదని విశ్వసించాడు. ఆ సత్యం కోసం అన్వేషించాడు. సత్యాన్వేషణ అతనికి ధ్యేయమైంది.. దానికోసం తన ప్రాణాలనుకూడా ఒడ్డటానికి సిద్ధపడినాడు. అందుచేతనే అతనికి భగవద్దర్శనం కల్గింది.