తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, January 29, 2009

తెలుగు పునర్వైభవం అంటే ఆంగ్లం అసలు వద్దని కాదు

తెలుగు భాష పునరుద్ధరణ,పునర్వైభవం అనగానే తెలుగు కడుపుకు కూడుపెట్టదు, విషయం కడుపు కాలే వాళ్ళకుమాత్రం తెలుస్తుంది అని కొందరు బ్లాగ్మిత్రులు తమ టపాలలో వ్రాయడం చూసాను. అది వారి తప్పు కాదు.తెలుగు భాషపునరుద్ధరణ అనే విషయానికి ఒక వివరణ ఇవ్వవలసి ఉంటుంది.
ఒక వ్యక్తి మానసికముగా కానీ, సామాజికముగా కానీ అభివృద్ధి చెందాలంటే మాతృభాష లోనే వ్యక్తి యొక్క ప్రాథమికవిద్య ఉండాలనేది ఎందరో మేధావులు,అనుభవశీలురు చెబుతున్న విషయం. ప్రాథమిక దశను దాటిన తర్వాత అతను భాషలో తన విద్యను అభ్యసించినా అతను నెగ్గుకు రాగలడు.అప్పుడు వ్యక్తి ఆంగ్లం అభ్యసించినా చాలా సులభముగాపైకి రాగలడు.
మనం తెలుగును ప్రేమించడం అంటే ఆంగ్లాన్ని ద్వేషించడం అని అర్థం కాదు అన్న విషయాన్ని కొందరు కడుపుకాలుతున్న బ్లాగ్మిత్రులు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరూ వద్దనలేదు ఆంగ్లం చదవద్దని. తెలుగును మాత్రం మరవద్దు, చిన్నచూపును చూడవద్దు అని మాత్రమే మేము అంటున్నాము. అవసరమైన చోట ఆంగ్లాన్ని వాడవద్దని ఎవరూవద్దనడం లేదు. కాని నిత్యజీవితం లో తెలుగు వాడకాన్ని ప్రోత్సహిద్దాం, మనము కూడా అలానే పాటిద్దాం అనిఅంటున్నాము.
ప్రపంచం కుగ్రామం ఐపోతోంది కాబట్టి అందరినీ కలిపే భాష ఆంగ్లం అని అనవచ్చు.తప్పు లేదు. మనం మన రాష్ట్రం,దేశంకానివారితో ఆంగ్లం లోనే మాట్లాడుదాం. దానికోసం ఆంగ్లం నేర్చుకొందాం. మన ఉన్నతవిద్యలు కావాలంటే ఆంగ్లంలోనేచదువుదాం. కాని మన పిల్లలను తమ ప్రాథమిక విద్యను తెలుగులోనే చదివిద్దాం ,ఇప్పటి పరిస్థితుల ప్రకారం వారిఉన్నతవిద్యలను ఆంగ్లంలో చదివిద్దాం. కాని మన తెలుగుభాష ఔన్నత్యాన్ని ,మధురత్వాన్ని ఖచ్చితముగాకాపాడుకోవలసిన అవసరం లేదంటారా?
మనవారు ఆంగ్లంలో మాట్లాడడమే గొప్ప అని తలుస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి తెలుగు మన ఆత్మ ,ఆంగ్లంకేవలం మనసు లాంటిది మాత్రమే. మనసు బయటికి శక్తివంతమే కానీ ఆత్మ లేని మనసు ఉనికి లేనిది.
మనం ఆంగ్లం మాట్లాడేటప్పుడు మన మనసు తన భావాలను మొదట తెలుగు రూపం లోనే సృష్టించి తర్వాత భావాలను ఆంగ్లంలోనికి తర్జుమా చేసి బయటకు పంపుతుంది. ఎంతో సాధన తర్వాత మాత్రమే పని లేకుండాఒకేసారి ఆంగ్లంలో మాట్లాడగలం. విధముగా తెలుగు (మాతృభాష) సహాయంతో మాత్రమే మనం ఆంగ్లం నేర్చుకొనిబయట ఎక్కడైనా బ్రతకగలం. ఇంత సేవ చేసిన మన మాతృభాషకు మనం ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నామా? ! కడుపు కాలుతున్న బ్లాగ్మిత్రులారా గుండె పై చేయి పెట్టుకొని చెప్పండి.
మన భాష రానివారితో మనం ఆంగ్లంలోనే మాట్లాడుదాం.కాని మనలో మనం తెలుగులోనే మాట్లాడుకొందాం.మనలోమనం ఆంగ్లంలో మాట్లాడుకోవలసిన దౌర్భాగ్యం మనకు ఎందుకు? మన భాష అంత గొడ్డుపోయిందా?
ఒక పోతన,ఒక వేమన, ఒక అన్నమాచార్యుడు లాంటి తెలుగు వారు గర్వించే మహానుభావులు పుట్టిన రాష్ట్రం మనది. పోతన గారి పద్యాలలో మధురత్వం,వేమన పద్యాలలోని సమాజంలో ఎలా ఉండాలి అనే విషయం మరియుఅన్నమాచార్యుల కీర్తనలలోని భక్తి భావం మన తర్వాత తరాలవారికి కూడా అందించవలసిన భాధ్యత ఉంది.అందుకోసంకూడా తెలుగును రక్షించవలసిన అవసరం మన పై ఉంది.
ఒక మనిషి యొక్క సంస్కృతిని,సంస్కారాన్ని అతని వేష"భాష"లే తెల్పుతాయి అనడం మనకు తెలుసు.మనలో మనంకూడా ఆంగ్లం మాట్లాడుకుంటే,మన పిల్లలకు తెలుగుపై రుచి ఎలా కల్గుతుంది? మనకంటూ ఒక సొంతభాషనుకోల్పోయినప్పుడు ఇతరులు మాత్రం మనలను ఎవరు గౌరవిస్తారు?
దీనికి ఒక ఉదాహరణగా మన రాజధానిలో కూకట్పల్లి లో "మెట్రో" అనే ఒక పెద్ద వాణిజ్యసముదాయం ఉంది. వారుమొదట దానిని ప్రారంభించినప్పుడు భవనం పైన తెలుగులో పెద్ద అక్షరాలతో "మెట్రో" అని ఒక నామఫలకం, దాని క్రిందఆంగ్లంలో ఒక నామఫలకం ఏర్ఫాటు చేసారు. ముచ్చట ఎంతోకాలం సాగలేదు. వారికి మన భాషాభిమానం పాటిదోతెలిసిపోయి కొన్నిరోజులలోనే రెండు ఫలకాలనూ ఆంగ్లంలోనికే మార్చివేసారు.ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనగడ్డపైనే మన భాషకు ఇలాంటి అవమానం జరుగుతోంది.
వారిని ఆంగ్లం వ్రాయవద్దని అనలేదే, తెలుగులో కూడ వ్రాయమని అడుగుతున్నాం.
ఇక మన వారే మన రోడ్డు రవాణా సంస్థ వారే తమ గరుడ,అంతర రాష్ట్ర బస్సులపై తెలుగును మొత్తం తీసివేసి అంతాఆంగ్లమే వాడుతుంటే మన రాష్ట్రం లోనికి వచ్చి బ్రతికే ఇతరులకు మన భాషకు మాత్రం గౌరవం ఇస్తారు చెప్పండి?
ప్రస్తుతం ప్రపంచంలో చలామణి అవుతున్న భాషా స్వచ్ఛమైనది కాదు. ప్రతి భాషా ఇతర భాషల నుండి కొన్నిపదాలను కలుపుకొంటుంది.తెలుగు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాని ఇతర భాషలు తమ భాషలో ఇతరభాషలకు చెందిన పదాలకు సమాన పదాలు లేకుంటేనో లేక అది ఒక క్రొత్త పదం అయితేనో పదాన్ని యధాతథంగాతన భాష లోనికి తీసుకొంటాయి.ఉంటే కనుక ఉన్న పదాలనే వాడుతాయి. కాని మన తెలుగు భాష మాట్లాడేవారుతెలుగులో ఆంగ్లమో లేక మరే ఇతర భాషలోని పదాలకు తెలుగులో సమానార్థక పదాలున్నా అవి వాడరు.నాచిన్నప్పుడు నువ్వు తరగతి చదువుతున్నావు అంటే ఫలానా తరగతి చదువుతున్నాను అని పిల్లలు సమాధానాలుఇచ్చేవారు. కాని ఇప్పుడు తరగతి అనే పదాన్ని పెద్దలే వాడడం లేదు స్థానే "క్లాస్" అనే ఆంగ్ల పదం చేరిపోయింది. పిల్లలు కూడా మేము ఫస్ట్ స్టాండర్డ్ అనో లేక ఫస్ట్ క్లాస్ అనో చదువుతున్నామని అంటున్నారు. ఇలా మూలం దగ్గరేతెలుగును వాడకపోతే ఎలా?

చివరిగా ఒకమాట.మాతృభాష అనేది ఒక ఇంటికి కాని మరే నిర్మాణానికి కాని వేసే పునాది వంటిది. పునాది లేనినిర్మాణం ఎలా నిలబడదో మాతృభాష పునాది లేని జీవితం అలా నిలబడదు.పునాది వేసిన తర్వాతే దాని పై ఇతరనిర్మాణం ఎలా గావించగలమో అలానే మాతృభాష పునాది పైనే మనిషి ఉన్నతి నిర్ణయించబడుతుంది.

1 comment:

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు