తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, December 22, 2011

ఈ మతంలో కొంత మంచి ఉంది, ఆ మతంలో కూడా కొద్దిగా ఉందేమో

దేవుడొక్కడే అని అందరికీ తెలుసు. కానీ మళ్ళీ నా మతం,నీ మతం అని అంటాము. అనేక మతాలు ఉన్నాయనటం భ్రాంతి మాత్రమే. ఉన్నది ఒకే ధర్మం."ఏకమేవ అద్వితీయం" అనే సత్యమే అనాదిగా వస్తోంది.లోకం లో వేర్వేరు ప్రవృత్తులు గల మనుషులు జన్మిస్తుండేటంత వరకూ ఆ అద్వితీయ దైవమే పాత్రోచిత మార్పులను పొందుతుందని గ్రహిస్తే, మనం పరస్పర సహనాన్ని చూపించుకోగలం.


"నదులన్నీ వేర్వేరు తావుల్లో జన్మించి,ఋజు లేక వక్రమార్గాలలో పయనించి సముద్రంలో కలిసిపోయేటట్లు, వివిధ శాఖల వారు విభిన్న దృక్పథాల్లో చివరకు నిన్నే చేరుతున్నారు(శివ మహిమ్నా స్తోత్రం 7)" అనేది అత్యంత వాస్తవం. కొందరంటారు "అవునవును,ఈ మతంలో కొంత మంచి ఉంది.ఇవి అధమ మతాలు.వీటిలో కూడా కొంత మంచి ఉంది" అని. అలాగే ఇతర మతాలన్నీ చరిత్రకందని కాలానికి పూర్వం జరిగిన క్రమపరిణామాన్ని సూచించే శిథిలాలనీ తమ మతం ఒక్కటే పరిపూర్ణమైన పరిణామాన్ని పొందినదనీ అంటారు. ఇంకొందరు తమ మతం నవీనమైనదవటంతో అదే సర్వోత్తమం అనీ సర్వశ్రేష్ఠతను దానికి ఆపాదిస్తున్నారు. కాని వీటన్నిటికీ సముద్ధరణ శక్తి సమంగానే ఉన్నదని మనం గ్రహించాలి.మనకు కనిపించే తేడాలన్నీ కేవలం గౌణ(secondary) విషయాలనే ఆశ్రయించుకొని ఉన్నాయి.ఇలాంటి విషయాలు మూఢాచారం నుండి పుట్టినవి. పిలిచేవారందరికీ భగవంతుడే సమాధానం ఇస్తాడు. ఎవరికి గానీ జీవుల ఉద్ధరణ గురించి కానీ,వారి ముక్తిని గురించి కానీ తలకొట్టుకోవలసిన అవసరం లేదు. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడే జీవుల ఉద్ధరణ గురించి ఆలోచిస్తాడు. ఒకే భగవంతుడు జీవుల మొరలను ఆలకిస్తున్నాడు.


ఒక వైపు తమకు దేవుడిపై విశ్వాసం ఉందంటూ , మళ్ళీ తమ మతం భుజస్కందాలపైనే మానవకోటిని ఉద్ధరించే భారం ఉందని అసంబద్ధంగా మాట్లాడే వారి తీరు ఎలాంటిదో నాకు తెలియడం లేదు. దీనిని ధర్మం అనగలమా? ధర్మం అంటే భగవత్ సాక్షాత్కారం.


మాటలు,కేవలం మాటలలోనే విశ్వాసం, గ్రుడ్డితనం తో తడుముకోవడం, పూర్వుల సిద్ధాంతాలను చిలుకల మాదిరి పలుకుతూ మతం పేరున రాజకీయాలను చేయడం తగదు. ఇప్పుడు కొందరు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తునందని అనుకొంటున్న ఇస్లాం మతంలో కూడా " ప్రభూ! నువ్వు సర్వేశ్వరుడివి.నీవు అందరి హృదయాలలో ఉన్నావు.నువ్వే ప్రతివారికీ శరణు. నువ్వే జగద్గురువవు.నీ ప్రజలు నివశించే భూమిని రక్షింప నువ్వే మా అందరికంటే అధికముగా ప్రయత్నిస్తావు" అనే అమోఘవాక్యాలు వెలువడ్డాయి.


ఎవరి నమ్మకాలనూ చెరుపనవసరం లేదు. మంచిని ఇచ్చే శక్తిని ఉంటే ఇద్దాము. వారి విశ్వాసాలను కదల్పకుండానే వారిని బాగుపడనిద్దాము. దీనికేమీ అభ్యంతరం లేదు. కాని రెంటికీ చెడ్డ రేవడి పరిస్థితి ని ఎందుకు కల్పించాలి?

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు