సత్యం,పవిత్రత,నిస్వార్థం ఈ మూడు గుణాలున్న వ్యక్తిని ముల్లోకాల్లోని ఏ శక్తీ ఏ హానీ చేయలేదు.ఈ మూడు సద్గుణాలతో శోభిల్లే వ్యక్తి సమస్త విశ్వాన్నీ ఎదుర్కోగల
సమర్థుడు
-- స్వామివివేకానంద
౧.సత్యం:
"సత్యం" ఈ మాట వింటేనే మనలో చాలామందికి వణుకు వస్తుంది.కానీ ఒక్కటి మరువరాదు
"సత్యమేవ జయతే,నానృతం" - ముండకోపనిషత్తు
సత్యమే జయిస్తుంది,అసత్యమెన్నటికీ కాదు.
అందరూ అనుకుంటారు " సత్యమే మాట్లాడుతూ కార్యాలయాలలోనూ,వ్యాపారాలలోనూ ఈ కాలంలో పనిచేయడం అసంభవం అని".కానీ ఇక్కడ గమనించవలసిన
విషయం ఏమిటంటే "సత్యం పురాతనమైనా,ఆధునికమైనా ఏ సమాజానికీ తలవంచదు;సమాజమే సత్యానికి తలవంచాలి".
సత్యం యొక్క తక్షణఫలితాలు చేదుగా అనిపించినా అంతిమ ఫలితం శుభమే అన్న విషయం చరిత్రలో ఋజువైంది.సత్యం పలుకువాడు దేనికీ తలవంచనవసరం
లేదు,భయపడనవసరం లేదు.
౨.పవిత్రత:
"పవిత్ర హృదయులు ధన్యులు.ఎందుకంటే వారు దేవుడిని దర్శిస్తారు" - బైబిల్
పవిత్ర హృదయం అనగా నిష్కల్మష హృదయమే.ఏదైనా పని నిర్విఘ్నంగా సాధించాలంటే ముందు మన మనసు పరిశుభ్రంగా ఉండాలి.ఆ పని చేస్తున్నంతవరకూ మన శ్వాస,ధ్యాస అంతా అప్పటికి ఆ పనే కావాలి.కాని ఇది సాధ్యం కావాలంటే పవిత్రమైన మనసుకు తప్ప మరేవిధంగానూ సాధ్యం కాదు.
పవిత్రత నిండిన హృదయం కులం,మతం,జాతి,సంప్రదాయం-అనే భేదబుద్ధిని విడిచి సమస్త విశ్వాన్నీ ఆలింగనం చేసుకుంటుంది.అప్పుడు మన పనికి ఏ విధమైన ఆటంకమూ ఏమీ చెయ్యలేదు.ఎందుకంటే అప్పుడు మన మనసు పవిత్రం కావడం వలన ఏ ఆటంకమునైనా మనము తేలికగా దాటగలము.
౩.నిస్వార్థత:
నేడు ప్రపంచంలో చాలామంది తమ స్వార్థం కోసమే జీవిస్తున్నారు.ఇక్కడ స్వార్థం అనగా స్వ+అర్థం=సొంత ప్రయోజనం కోసమే అని.
నిజం చెప్పాలంటే స్వార్థం లేనివాళ్ళు అంటూ ఎవరూ ఉండరు.కాని ఆ స్వార్థ శాతాన్ని తమ జీవితంలో ఎంతమేరకు తగ్గించుకుంటారో అంత ఎక్కువ ఆనందం అనేది అనుభవం అవుతుంది.
"చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష" అని అనుకున్నంత కాలం స్వార్థం అనేది లవలేశమైనా తగ్గదు.అందరికీ అనుభవమే పంచుకొని తినడంలో,అనుభవించడంలో గల ఆనందం.కాని ఎవరూ ఆచరణలో పెట్టలేకపోతున్నారు.ఎప్పుడైతే నిస్వార్థత మనకు కలుగుతుందో అప్పుడే మనశ్శాంతి వస్తుంది.కోట్లు సంపాదించినా పొందలేని మనశ్శాంతి మన వశమవుతుంది.
మనం ప్రపంచాన్ని మన మనసు ద్వారానే చూస్తున్నము కాబట్టి పరిశుద్దమైన మనసు ద్వారా మనకు ప్రపంచంలోని మంచే కనిపిస్తుంది.
సత్యం ద్వారా పవిత్రత,తద్వారా నిస్వార్థత అలవడుతాయి.