సదాశివబ్రహ్మేంద్రస్వామి వారు తమిళనాడు లో జన్మించిన మహాత్ముడు.వీరి తండ్రిగారి పేరు మోక్షసోమసుందర అవధాని.వీరు రామ,కృష్ణులను పూజించేవారు.వీరి భార్య పేరు పార్వతి .ఈమె శివుడిని పూజించేది.అందువలన వీరు తమకు కలిగిన కుమారుడికి శివరామకృష్ణ అని పేరు పెట్టారు.
ఇతను చిన్నప్పటి నుండే మిగతా పిల్లల కంటే తేడాగా ఉండేవాడు.వైరాగ్యం మొదలగు భావాలు ఉండేవి.అందువలన పెళ్ళి చేస్తే అంతా సరిపోతుందని వీరి తల్లిదండ్రులు భావించారు.మొదట స్వాములవారు వ్యతిరేకించినా ఒక కుమారుడిగా వారు చూసిన అమ్మాయిని 17 సంవత్సరాల వయస్సు లో పెళ్ళాడాడు.
కానీ అతను ఏ మాత్రం మారలేదు.అతనిలో వైరాగ్య భావాలు దృఢంగా ఉన్నాయి.ఇలా ఉండగా అతని భార్య పుష్పవతి అయ్యింది( ఆ కాలం లో బాల్యవివాహాల ఆచారం ఉండేది).మొదతిరాత్రిని స్వామిగారి మామగారింట్లో చేయాలని అందుకు తగ్గ వంటావార్పూ,సంభారాలు మొదలు పెట్టారు.స్వామికి విపరీతంగా ఆకలి అయ్యి వంటగది వద్దకు వెళ్ళి "నాకు ప్రత్యేక వంటకాలు అవసరం లేదు.ఏదుంటే అది పెట్టండి తినడానికి"అన్నాడు.అప్పుడు వారి అత్తగారు"దయచేసి కొద్దిసేపు వేచిఉండండి.మీరు ఎక్కువసేపు వేచి ఉండనవసరం లేదు.లోనికిరావద్దు.బయటనే ఉండు"అన్నది.
"లోనికిరావద్దు.బయటనే ఉండు" అన్న మాటలు స్వామిలో అనుకోని మార్పును వెంటనే తీసుకుని వచ్చింది."గృహస్థాశ్రమం లోకి రావద్దు.బయటనే ఉండి జ్ఞానాన్ని పొందు" అని స్వామివారు అర్థం చేసుకున్నారు.ఆకలినే తీర్చలేనివాళ్ళు తనకు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు?అని అనుకుంటూ స్వామి అక్కడినుండి వెల్లిపోయారు.బందువులు అతన్ని కనుగొనలేకపోయారు.
అతను తర్వాత అడవులలోనూ,నదీ తీరాలలోనూ గడిపాడు.భిక్షాటన చేసుకుని ఆకలి తీర్చుకునేవాడు.తనకే ఉండడానికి ప్రదేశంలేనివాడు దేవుడికి ఎక్కడ ప్రదేశం చూపించి పూజించాలి?అందువలన తన హృదయంలో పూజించేవాడు.ఈ మానసిక పూజను తన "శివ మానసికపూజ" అను స్తోత్రంలో వర్ణించాడు.
"ఓ శివా! అంతటా నీవి వ్యాపించిఉన్నావు.నిన్ని నేనెక్కడ పూజించగలను?ఆకాశమే నీ వస్త్రాలైనప్పుడు నీకు నేను ఏ వస్త్రం ఇవ్వగలను?"అంటూ స్తోత్రం చేశాడు.
ఈ హృదయవిదారక ప్రార్ఠన విని శివుడు స్వామివారికి కామకోటిపీఠంకు చెందిన పరమశివేంద్రసరస్వతి ని గురువుగా పంపాడు.గురువుగారు స్వామిని చూసి అతని లోని చైతన్యాన్ని గుర్తించి "సదాశివా"అంటూ పిలిచాడు.అప్పటి నుండి "శివరామకృష్ణ" పేరు "సదాశివ"అయ్యింది.వారి పీఠం పేరు కలుపుకొని "సదాశివబ్రహ్మేంద్రసరస్వతి" అయ్యింది.తన గురువుగారిని ఎంతగానోసేవించి అనేక కీర్తనలు,స్తోత్రాలు బ్రహ్మసూత్రాలకు పాతంజలయోగసూత్రాలకు వ్యాఖ్యానం చేసాడు.అన్నిటిని తన గురువుకు అంకితం చేసాడు.తన స్తోత్రాలకు మకుటం గా "పరమహంసగురు" అని ఎంచుకున్నాడు.
స్వామివారు ఎంతోమందితో వాదించి అందరినీ ఓడించేవాడు.ఒకసారి ఇలా ఓడిన పండితుడు గురువుగారికి ఫిర్యాదు చేసాడు.అప్పుడు గురువు గారు" ఓ! సదాశివా! నీవు ఎప్పుడు నిశ్శబ్దంగాఉంటావు?"అన్నాడు.మీ అనుగ్రహంతో ఇప్పుడే అంటూ సదాశివులవారు అన్నారు.గురువుగారి నుండి వెళ్ళిపోయి తను మౌనంలో అనుభవించిన అనుభవాలను తన కీర్తనల్లో వర్ణించాడు.లౌకిక విషయాలను వదిలి పెట్టి తనలోనే ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తూ ,తన దగ్గరకు వచ్చింది తింటూ జీవించాడు.
ఒకసారి ఈవిధంగా సమాధిస్థితిలో ఒక గడ్డివాము దగ్గర నిలిచున్నాడు.ఆ వాము యజమాని స్వామిని ఒక దొంగ అనుకొని కొట్టబోయాడు.వెంటనే అతను శిలావిగ్రహంలా ఉండిపోయాడు.స్వామికి ఇవేమీ తెలియదు.మరుసటి ఉదయం మెలకువలోనికి వచ్చినప్పుడు నవ్వుతూ ఆ రైతు వంక చూడగా ఆశ్చర్యకరంగా అతను మళ్ళీమామూలుగా అయ్యాడు.క్షమాపణ ఆడిగాడు.స్వామి నవ్వుతూ వెల్లిపోయాడు.ఒకసారి ఇదేవిధంగా సమాధిస్థితిలో కావేరి నదీతీరంలో ఉన్నప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోయాడు.మూడునెలల తర్వాత రైతులు ఇసుకమేటలు తొలగిస్తున్నప్పుడు ఒక గడ్డపార తగిలి స్పృహలోకి వచ్చి ఏమీజరగనివాడిలా వెళ్ళిపొయాడు.ఇలాంటి మహిమలెన్నో స్వామిజీవితంలో జరిగాయి.
చివరికి స్వామివారు తమిళనాడులోని నేరూరు లో స్థిరపడ్డారు.అక్కడి రాజు స్వామి ఉపదేశాలను పాటించి పరిపాలన చేసాడు.ఇప్పటికీ తమిళనాడు లో స్వామి కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.
స్వామి వారి ఉపదేశం " నీవుకోరుకున్నది చేయవద్దు.అప్పుడు నీకు నచ్చినది చేయవచ్చు" అని.
స్వామివారు నేరూరులోనే సమాధి పొందారు.