తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, February 13, 2009

మేము మారము గాక మారము, మేమింతే - నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు

అసలు ఏమవుతోంది మన దేశంలో? దేశంలో పూటకు గతిలేక అన్నమో రామచంద్రా అంటూ పస్తులు ఉంటున్న ప్రజలు ఎందరో ఉన్నారు.ఉండడానికి పూరిపాక,కట్టుకోవడానికి గుడ్డపేలిక లేక ఎందరో అలమటిస్తున్నారు. మనిషి కనీస అవసరాలకే గతి లేక చస్తుంటే మన భారతీయులు,భారతీయ యువత ఏం చేస్తున్నారు?

సంస్కృతీ పరిరక్షణ అంటూ కొందరు, తమ మతమే గొప్పదని,తమ మతం తప్ప వేరే దిక్కు లేదని కొందరు , హక్కులే తప్ప బాధ్యత మాకు పట్టదని యువత ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో.

ఆ మధ్య సంస్కృతీపరిరక్షకులమంటూ కొందరు మంగళూరు లో పబ్బుపై దాడి చేసారు. ఆ కుహనా పరిరక్షకులలో అందరూ యువకులే పాల్గొన్నారు. ఆకలిగొన్న పేదలకు ఒక పూట తిండి పెట్టలేని వారు, వారికి ఒక పూరిపాక నిర్మించలేనివారు, కట్టుకోవడానికి కనీసం తమ పాతబట్టలు కూడా ఇవ్వలేని వారు వీరండీ సంస్కృతీ పరిరక్షకులు. అసలు ఒకరి వ్యక్తిగత స్వాతంత్ర్యము, వ్యక్తిగత జీవితము పై వీరి అధికారము ఏంటి? ఎవరి హద్దులలో వారు ఉంటే మంచిది. ఎవరికీ ఎవరిపై పెత్తనము చలాయించే హక్కు గాని, అధికారము గానీ లేవు.

"అన్నమో రామచంద్రా! అంటున్న వారికి మత భోధనలు ఎందుకు, వారికి పట్టెడన్నం పెట్టండి.ఒక కుక్కకు ఆకలి తీర్చడం కొరకు వెయ్యిజన్మలు ఎత్తడానికైనా,వేయిసార్లు నరకానికి పోవడానికైనా సిద్దమే" అన్న వివేకానందుని వాక్యాలు తెలుసుకోవాలి.

ఇక నేటి విద్యార్థుల (యువత) విషయానికి వద్దాము.

ప్రేమికులను కలపడానికి, వారి ప్రేమను నిలపడానికి తమ ప్రాణాలనైనా ఇస్తామంటారు. అదే సాటి మనిషి కొనప్రాణముతో కొట్టుమిట్టాడుతున్నా స్పందించరు.అది మా పని కాదు. ప్రభుత్వపు పని అంటారు. వెళ్ళే సినిమా హాళ్ళ వద్ద ,తాగే పబ్బుల వద్ద ఒక రూపాయి ఇమ్మంటూ అడిగే వారిని, తినడానికి ఏమైనా ఇమ్మనే వారిని చీదరించుకొంటారు. ఏం! యువతకు సంఘబాధ్యత (Social responsibility) లేదా?

ఈ ఫిబ్రవరి 14 ప్రేమికులదినోత్సవమును ఎవరూ ఆపలేరని,అది తమ హక్కు అని బెంగళూరులో చాలా కళాశాలల విద్యార్థినీ,విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించబోతున్నారు.అదీ అందరూ కలిసి. ప్రేమికులదినోత్సవం గా ని మరే దినోత్సవం కాని జరుపుకోవడంలో తప్పులేదు.నిరభ్యరంతరముగా జరుపుకోవచ్చు.అది మన హక్కు.

కాని ఏనాడైనా అన్ని కళాశాలలూ కలిసి ఈ విధముగా పోరాడినట్టు ప్రజాసమస్యలపై పోరాడారా? కాని హక్కుల కోసం పోరాడుతున్నామే కాని,బాధ్యతల గురించి పట్టించుకోమా? ఇప్పుడు ఇలా ర్యాలీ చేస్తున్నామే,ఎప్పుడైనా ఇంతగా మనలను ఈ ర్యాలీ ద్వారా ప్రజలను ఆకర్షించింట్లు సమాజంలోని అవినీతిపై గాని, అందరికీ కనీస అవసరాల కోసం కాని ఉద్యమించామా? అప్పుడప్పుడు ఎయిడ్స్ పై అవగాహన కోసం ర్యాలీలనునిర్వహిస్తుంటాము,అదీ కళాశాలల తరపున ,వారు నిర్వహిస్తామంటేనే. ఇక్కడ అందరినీ అనడం లేదు.కాని చాలామందినే అంటున్నాను.

ఎవరు అడ్డొచ్చినా మేము దినోత్సవాలు జరుపుకొంటామంటామే కానీ, ఎవరు ఏమన్నా లంచాలు ఇవ్వము,కనీస అవసరాల కోసం ఉద్యమిస్తాము అని యువత అంటున్నదా? పైగా మీడియా కూడా ఇలాంటి వార్తలకు ఇస్తున్నంత ప్రచారం మనిషి కనీస అవసరాలకై ఉద్యమిస్తున్న వారికి ప్రచారం కల్పిస్తోందా?లేదు. వారికి సంచలన వార్తలు, సున్నితాంశాలపై ప్రజలను ఆడుకోవడం తద్వారా తమ సర్క్యులేషన్ పెంచుకోవడం,డబ్బు సంపాదించడం ఇవే కావాలి.

కళాశాలల్లో ర్యాగింగ్ చేస్తారు. సాటి విద్యార్థులనే బాధ పెడతారు. ఇలాంటివారా దేశానికి భవిష్యత్తు? వీరా దేశాన్ని అభివృద్ధిపథములో నడిపేవారు?

ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. సంఘం బాగుంటేనే అందరమూ బాగుంటాము.

ఒక మదర్‌థెరెసా, ఒక వివేకానంద, ఒక గాంధీజీ, ఒక అబ్దుల్‌కలాం, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్,దేశ సైనికుడు వీరు నిజముగా యువతకు ఆదర్శముగా ఉండాలి.

హక్కుల కోసం పోరాడుతూ బాధ్యతలను విస్మరించడము దేశపతనానికే దారితీస్తుంది. మనిషి కనీస అవసరాలు తీర్చగలిగిన రోజు, ఏ ఒక్కరూ ఆకలితో చనిపోని రోజు ఆ రోజుకై పోరాడదాం.

గమనిక : ఇక్కడ నేను అందరినీ ఉద్దేశించి వ్రాయలేదు.




Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు