మొన్న ఉప్పల్,హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో అభం,శుభం ఎరుగని, కల్లాకపటం తెలియని చిన్నపిల్లలు ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. దీనికి కారణం మద్యం తాగి వాహనం నడపడమే.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మద్యం త్రాగండి, త్రాగి చంపండి, మీరూ చావండి" పథకం అత్యద్బుతంగా పనిచేస్తోంది. లేకుంటే ప్రజాసంక్షేమం మరిచి మద్యం ఏరులై పారిస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ఎండాకాలంలో వీధి వీధికో చలివేంద్రం ఉన్నట్లుగా వీధివీధికీ మద్యం అంగళ్ళ లైసెన్సులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వఖజానా నిండడం కోసం న్యాయమైన మార్గాలు వదిలి, ఇలాంటి మార్గాలు అనుసరిస్తూ ముక్కుపచ్చలారని పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రాణాలు తీస్తుంటే మనం ఇలా ఎన్నాళ్ళని చేతులు ముడుచుకొని కూర్చోవాలి? అనుభవజ్ఞులు కూడా ఏం చేయలేరా? కనీసం అనుభవజ్ఞులు ఒక ప్రణాళిక రచిస్తే ఇలాంటి సంఘటనల వలన బాధపడే యువత కూడా ముందుకొస్తుంది కదా!