మన జీవన సూత్రం ఏమంటే మన సొత్తు గురించి మనకు బయటి వారి సర్టిఫికేషన్(ధ్రువీకరణ) మనకు కావాలి. మన సొంత పరిశీలన చాలా తక్కువగా ఉంటుంది.
వేదాల విషయంలో కూడా జరిగింది, జరుగుతున్నదీ కూడా అదే.
వేదాలు మూడే అన్నారు. అధర్వణ వేదం వేదం కాదని తర్వాత చేరిందన్నారు.
'' చత్వారోహి ఇమే వేదా ఋగ్వేదో యజుర్వేదః
సామవేదో బ్రహ్మవేద ఇతి'' అని గోపథ బ్రాహ్మణం (పూర్వభాగం) అంది. బ్రహ్మవేదమే అథర్వవేదం
'వేదత్రయి' అని మరొక విభజన ఉంది. 1. పద్య, 2. గద్య 3. గేయవిభజన. వేదాలు పద్యంలో దర్శించినవీ, 2. గద్యంలో దర్శించినవీ 3. గేయంలో దర్శించినవీ ఉన్నాయి. ఇది ఛందో విభజన.
వేదం మూడు విషయాలను ప్రతిపాదిస్తుంది. అవి. 1. బ్రహ్మ, 2. ఆత్మ, 3. బ్రహ్మ ఆత్మల ఏకత్వం. అందుకు కూడ అది 'వేదత్రయి' అయింది.
ఇవన్నీ తెల్సుకోరు కానీ వేదాలు మూడే అంటారు, అలానే అని మనలను నమ్మించారు.
వేదానికి 'శ్రుతి' అని కూడా పేరుంది. 'శ్రుతి' అంటే చెవిన పడింది- విన్నది.
ఇంకేం పాశ్చాత్యులకు మంచి అస్త్రం దొరికింది. మనపై మనకే అపనమ్మకం ఏర్పడేలా చేసారు.
శ్రుతి అంటే విన్నది కాబట్టి వేదకాలం నాటికి అక్షరం లేదని వ్యాఖ్యానించారు. తొలుత వేదం పలుకబడింది , వ్రాయబడలేదు అన్నారు. అదే నిజం అని మనం నమ్ముతున్నాం.
వేదమంత్రాలు స్వర ప్రాధాన్యం కలవి కాబట్టి విని నేర్చుకొని ఒక విధానంలో వాటిని పలకాలి. ఇలా వింటూ నేర్చుకొనే విధానం ఉండేది కాబట్టి "శ్రుతి" అన్నారు.అంతే కాకుండా వేద మంత్రాలను ఋషులు తమ తపో బలంతో తపస్సు లో వాటిని విని అక్షరబద్దం చేసారు(వ్రాసారు). వారు వాటిని విన్నారు కాబట్టి శ్రుతి అయింది. పాశ్చాత్యులకు ఈ విషయం తెలుసో లేదో లేక తెలిసే మనలను నమ్మించారో తెలియదు. మనవాళ్ళూ వారు చెప్పిందే నమ్మారు.
గౌతమ బుద్దుడూ, శ్రీ రామానుజాచార్యులూ వేదాలను నిరసించారని మనలనే నమ్మేలా చేసారు. నిజానికి వారు నిరసించింది వేదాలను కాదనీ, వేదం పేరున జరుగుతున్న కర్మలను మాత్రమే అని మనం తెలుసుకోలేదు. వేదం అంటే యజ్ఞ,యాగాలు మాత్రమే అనే నమ్మకం కలిగించారు.ఇది ఈనాటికి జరుగుతున్నది.
"దైవం స్థాణోపరపరాధః యదేనం అంధో న పశ్యతి పురుషాపరాధః న భవతి'' ఒక పదార్థం ఉంది. దాన్ని గ్రుడ్డివాడు చూడడు. తప్పు పదార్థానిది కాదు.గ్రుడ్డివాడిది అవుతుంది.
వేదానికి అర్థం ఉంది. దాన్ని తెలుసుకోనివాడు గ్రుడ్డివాడు . అతడికి వేదకర్మ కనిపిస్తుంది. వేదార్థం కనిపించదు.
క్రీస్తుకు వేయి సంవత్సరాల ముందు వాడైన యాస్కఋషి చెప్పినట్లుగా
''ఒకడు బరువు మోస్తాడు. మోసిందేమిటో తెలియదు. అలాంటివాడే అర్థం తెలియకుండా వేదాన్ని వహించేవాడు.
వేదం చదివి అర్థం చేసుకున్నవాడికి సకల శుభాలు కలుగుతాయి. జ్ఞాన తేజస్సు పాపాల్ను కడిగేస్తుంది.''
అసలు మనము మనవాటి పైన శ్రద్ద చూపనప్పుడు వారిని అని మాత్రం ఏం లాభం? పైన చెప్పిన ఉదాహరణలు కొన్ని మాత్రమే. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోఎన్నెన్నో ఉన్నాయి. మరో టపాలో ఎప్పుడైనా అవి పంచుకొనే ప్రయత్నం చేస్తాను.