ఏంటండీ ఇంద్రుడు ఎప్పుడూ తమ మానాన తాము దైవసాక్షాత్కారం కోసం తపస్సు చేసుకొనే ఋషుల తపస్సును భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూంటాడు. అలానే అతనికి ఒక మామూలు మనుషికి ఉండే దుర్గుణాలన్నీ ఉంటాయి. అంటే ఇతర స్త్రీలను ఆశించడం, పదవీ వ్యామోహం మొదలగునవి ఉంటాయి. మరి ఇలాంటి ఇంద్రునికి మనం ఎంతో గొప్పగా చెప్పుకొనే వేదాలలో అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు అనే సందేహం చాలామందికి ఉంది. విషయం తెలియక ఈ కారణంతోనే వేదాలను నింద చేసే వారున్నారు.
ఆ అనుమానంను నివృత్తి చేయడానికి ఈ టపా దోహదం చేస్తుందని భావిస్తున్నాను.
మొదట మనం ఇక్కడ తెలుసుకోవలసింది పైన అనుకొన్న ఇంద్రుడు ఒక దేవత లేక దేవతలరాజు,స్వర్గలోకాధిపతి. ఈ ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి.కాబట్టి ఈ ఇంద్రునికి మానవస్వభావాలన్నీ(కామ,క్రోధ,లోభాది గుణాలు)అంటగట్టబడ్డాయి. అందుకే ఇతను తన పదవి పోతుందనే భయము తో ఋషులు చేసే తపస్సును భగ్నం చేస్తుంటాడు.
ఇక వేదాలలో ప్రస్తుతింపబడ్డ లేక పూజింపబడిన ఇంద్రుని విషయానికి వద్దాం.
అసలు విషయం ఏమిటంటే వేదాలలో ఇంద్రునిగా భావించి పూజించినది ఇంద్రుడు అనే దేవతను కాదు, "ఇంద్ర" అనే శబ్దాన్నిలేక ఆ శబ్దానికి అర్హులైనవారిని.
ఈ "ఇంద్ర" అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఎందుకని పూజించారు?. అన్న ప్రశ్నలకు ఋగ్వేదములోని ఐతరేయోపనిషత్తు సమాధానం చెబుతుంది. ఇందులోని 1వ అధ్యాయం, 3వ అనువాకంలోని 13,14 శ్లోకాలు అర్థం
13.మనుష్యరూపమున ఉత్పన్నమైన జీవుడు ఈ విచిత్ర జగత్తును చూచి దీని కర్త, ధర్త(ధరించువాడు) మరియొకరు ఉండవలెనని భావించి తన హృదయమందు అంతర్యామి రూపమున విరాజిల్లు పరమాత్మ సాక్షాత్కారము పొందెను. పరమాత్మయే ఈ విచిత్ర జగత్తుకు కర్త,ధర్త(ధరించువాడు)యని, ఆయన శక్తి యందు పూర్ణ విశ్వాసముకలిగి, ఆయనను పొంద ఉత్సుకతతో ప్రయత్నించిన ఆయనను పొందగలడు, మనుష్య శరీరము ద్వారానే ఆయనను పొందవచ్చును. కావున మనుష్యుడు తన అమూల్య సమయమును వృధాచేయక పరమాత్మ ప్రాప్తికి సాధన చేయవలెను.
14.మనుష్య శరీర రూపమున ఉత్పన్నమైన జీవుడు పై చెప్పిన విధమున పరమాత్మను సాక్షాత్కరింప జేసుకొనుటచే పరమాత్మను ఇదం+ద్ర= ఇదంద్ర. అంటే "నేను చూచితిని" అను పేరుతో చే పిలుతురు. అదియే పరోక్షరూపమున అంటే వ్యావహారిక రూపమున "ఇంద్ర" అనే పేరుతో వ్యవహరింతురు.
కాబట్టి వేదాల ప్రకారం ఇంద్రుడు అంటే కేవలం ఒక్కరే కాదు. ఎవరెవరు భగవంతుని చూసారో లేక ప్రత్యక్షం చేసుకొన్నారో వారందరూ ఇంద్రులే.
అటువంటి ఇంద్రులను లేక ఇంద్ర శబ్దాన్ని పొందినవారినే వేదాలలో పూజించారు. అంతేకాని ఒకే ఇంద్రున్ని లేక ఇంద్రుడనే వ్యక్తిని అని కాని కాదు.
గమనిక : గతంలో ఈ విషయానికి సంబందించిన టపా వ్రాసినప్పటికీ పొరపాటున అది తొలగింపబడడం వలన మళ్ళీ వ్రాస్తున్నాను.