మొన్న మౌనిక అనే నర్సింగ్ చదివే అమ్మాయి ఆత్మహత్య చేసుకొంది. ఇంత చిన్న వయసులో పిల్లలు అలా ఆత్మహత్యలు చేసుకోవడం చూసి ఎందరు బాధపడరు? కొందరు పరీక్షలలో తప్పామనో, మరి కొందరు ప్రేమలు విఫలమయ్యాయనో, ఇంకొందరు తమకు అవమానాలు జరుగుతున్నాయనో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.
ఎన్నో విషాదకరసంఘటనలు జరుగుతున్నా బ్రతుకుతున్నామంటే మన వలన జరగవలసింది ఇంకా ఉందన్నమాటే కదా! పరీక్ష ఫెయిల్ అయినవెంటనే లేక ప్రేమ విఫలమైన వెంటనే లేక అవమానం పొందిన వెంటనే ప్రాణం దానంతట అది ఎందుకు పోవడం లేదు? అలా పోతే ఏం చెప్పలేము. కానీ 99% అలా పోవడం లేదే! అంటే ఇంకా అవకాశాలు ఉన్నాయన్న మాటే కదా!
ఏమైనా అంటే " మా పొజిషన్ లో మీరుంటే మీకు తెలుస్తుంది" అంటారు. ఎవరి స్థితి వారికి బాధాకరమైనదే. కాని అదే లోకమా? ఇంక ప్రపంచమే లేదా?
బ్రతకడానికి ధైర్యం కల్గించే మాటలు ఉపాధ్యాయులూ చెప్పరు, తల్లిదండ్రులూ చెప్పరు. అందరినీ అలా అనడం లేదు కానీ చాలా మంది ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఎప్పటికీ ర్యాంకుల, మార్కుల గోలే కానీ ఒక పిల్లవాడు వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడు? అని చాలామంది తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ చూడడం లేదు.
ఇక స్నేహితుల విషయానికి వస్తే తమ స్నేహితుడు(స్నేహితురాలు) ఒకరిని ప్రేమిస్తున్నామంటే మద్దతు బాగా ఇస్తారు కానీ ఎందుకు సపోర్ట్ చెయ్యాలి,అవుతుందాలేదా అనే ముందుచూపు కానీ ఉండదు. అంతే కాక వారి ప్రేమ విఫలం ఐతే ధైర్యం చెప్పడం కానీ ఉండదు. అందరినీ ఇలా అనడం లేదు కానీ చాలామందే ఇలా ఉంటున్నారు.
నా ఇంజనీరింగ్ చదువు అయిపోయి 7 సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంతవరకు నాకు పర్మనెంట్ ఉద్యోగం లేదు.ఎన్నో ఉద్యోగాలు చేతివరకు వచ్చి, చివరి క్షణంలో జారిపోయాయి. పార్ట్‌టైం ఉద్యోగాలే చేసుకొంటూ ఉన్నాను. ఇదే కారణాన వచ్చిన పెళ్ళిసంబంధాలు వెళ్ళిపోయాయి. ఇంట్లో వారి బాధలూ, బయటి వారి అవమానాలూ ఎన్నో భరిస్తున్నాను.బాధపడ్డాను ఎందుకంటే నేను కూడా ఒక మనిషిని మాత్రమే.అంతవరకే.కానీ ఏనాడూ ఒక స్థాయిని మించి బాధపడలేదు.
నాకు స్పూర్తిని ఇచ్చిన మహామంత్రం పరమహంస యోగానంద చెప్పిన" మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఎన్నటికీ ఇవ్వడు ".
రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయుడు ఒక మాట అంటాడు.""చనిపోవుట అనేక దోషాలకు కారణమవుతుంది. బ్రతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది"అని.ఇలాంటి స్పూర్తిదాయక మాటలు చెప్పేవారుండరు.
ఎప్పుడూ సిలబస్ పుస్తకాలే లోకం కానీ మహాత్ముల పుస్తకాలు చదవరు, అలా చదవడానికి ప్రోత్సాహం కూడా చాలా తక్కువే. కొంతమంది ఒంటరితనం భరించలేక కూడా ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. వీరికీ తోడు ఇవ్వలేనప్పుడు మహాత్ముల,గొప్పవారి జీవిత చరిత్రల పుస్తకాలు చదవడమే తోడు అవుతుంది. అలా అలవాటు చేయడం ఎంతో ముఖ్యం కదా!.
పెద్దలు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వీరందరికీ నా మనవి ఒక్కటే చదువులు ఎన్నైనా చదివించండి లేక చెప్పండి అలాగే మనుషులను ధైర్యవంతులుగా చేసే మాటలు, బ్రతకడానికి
స్పూర్తిని కల్గించే బోధనలు చెప్పండి.
స్నేహితులను కూడా ఇదే వేడుకొంటున్నాను.
చివరిగా ఒక మాట "బలమే(ధైర్యమే) జీవితము, బలహీనతయే మరణము". కాబట్టి ఆత్మవిశ్వాసము, ధైర్యమూ కలిగించే మాటలనే ఎప్పుడూ తల్చుకొందాము.
అలా అందరూ తలచుకొనేలా ప్రయత్నిద్దాము.