తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, July 13, 2010

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి అసాధారణ జ్ఞాపక శక్తి మనకు ఆశ్చర్యం కల్గించక మానదు


"రామాయణ కల్పవృక్షం", "వేయిపడగలు" వ్రాసిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలియని తెలుగువారు ఉండరు. వారి అత్యద్భుత అసాధారణ జ్ఞాపకశక్తి ని తెల్పే క్రింది సంఘటన చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

అవి వారు రామాయణ కల్పవృక్షం రచిస్తున్న రోజులు. విశ్వనాథ గారు చెప్తుంటే వారి కొడుకులు వ్రాసేవారు. ఒక రోజు చూసుకొంటే 32 వ కాగితం నుండి 72 వ కాగితం వరకు కనిపించలేదు. ఇల్లంతా వెదికారు. కానీ కనబడలేదు. వారికి తమ తండ్రి గారైన విశ్వనాథ గారంటే చాలా భయభక్తులు ఉండేవి. అందువలన ఈ విషయం చెప్పడానికి సాహసించలేదు. గ్రంథం వ్రాయడం పూర్తయింది. ఇక ముద్రణకు వెళ్ళాలి. ఇక తప్పదనుకొని విశ్వనాథ గారికి చెప్పారు.

అందుకు విశ్వనాథ గారు " అందులో బాధపడాల్సింది ఏం లేదు" అంటూ మళ్ళీ పూర్తిగా కనబడకుండా పోయిన 40 కాగితాలలో ఉన్నదంతా చెప్పేసారు.

తర్వాత ఇంట్లో ఇంతకుముందు కనబడకపోయిన 32 నుండి 72 వరకు 40 కాగితాలు దొరికాయి.
అత్యంత ఆశ్చర్యకరం గా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా కనబడకుండా పోయిన కాగితాలలోని విషయం క్రొత్తగా మళ్ళీ చెప్పబడిన కాగితాలలో ఉంది. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు,తప్పు లేదు.

ఇంత అసాధారణ జ్ఞాపకశక్తి మనకు ఆశ్చర్యం కల్గించకమానదు.

8 comments:

 1. వివేకానందులు సాక్షాత్ బ్రహ్మైక స్థితిని పొందినవారు కదండీ. వీరికి కూడా చాలా అసాధారణ శక్తి ఉండేదండీ.

  ReplyDelete
 2. నిజమా! అద్భుతమైన విషయం!!

  ReplyDelete
 3. సురేష్ బాబూ! ఆనాటి మన పెద్దలకు ఏకాగ్రత; ఆత్మ నిగ్రహం; ఋజు వర్తనము; కార్య దీక్ష; అమితమైన ఆత్మ విశ్వాస హేతువులై త్రికరణ శుద్ధిగా ఏ పనైనా చేయ గలిగే వారు. మీరు చెప్పిన మాటలు ప్రత్యక్షర సత్యాలు. చక్కని విషయం మానవాళికి అత్యవసరమైనదిగా భావించి ఉదాహరణతో సహా చూపిన మీ కృషీ అభినందనీయము.
  ధన్యవాదములు.

  ReplyDelete
 4. విశ్వనాథ వారి ధారణ అసాధారణమైనది. దానికితోడు వారికి ఉపకరించింది ఛందస్సు. గణాల వల్ల, యతి,ప్రాసల వల్ల పద్యాలు అంతో ఇంతో గురుతుండి పోతాయి. ఇక మహాత్ముల సంగతి చెప్పవలసిన పనేమున్నది ?
  ఇలాంటి సంఘటనే డా. దాశరథి గారి విషయంలో కూడ జరిగింది. ఆయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రచించిన ’అగ్నిధార’, ’రుద్ర వీణ’ కావ్యాలు రెంటినీ నిజామాబాదు జెయిల్లోనే ఉండి రచించారు. అయితే అవి వ్రాసుకోడానికి ఆయనకు పేపర్లు, పెన్ను ఇచ్చేవారు కారు. ఆ కావ్యాల్లోని పద్యాలను ఆయన రెండేళ్ళ పాటు కేవలం ధారణలోనే ఉంచుకొన్నారు. కొన్ని, కొన్నింటిని అప్పుడప్పుడూ ఆయన, ఆయన తోటి ఖైదీ వట్టికోట ఆళ్వార్ స్వామి, పళ్ళు తోముకోడానికి ఇచ్చిన బొగ్గు ముక్కతో గోడలపై వ్రాసేవారు. జెయిలు అధికారులు వారిని చితకబాది, ఆ వ్రాతలను నీళ్ళతో కడిగించి తుడిపేవారు. స్వాతంత్ర్యం వచ్చాక వాటినన్నిటినీ దాశరథి గారు తమ ధారణాశక్తితో గుర్తు చేసుకొని 1949లో ఆ రెండు గ్రంథాలు ముద్రించి ప్రజల కందించారు.

  ReplyDelete
 5. దాశరథి గారి గురించి కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. వారు అనువదించిన వేదాలనే ఇప్పుడు చదువుతున్నానండీ.

  ReplyDelete
 6. ఒక్క మాట:
  ఆచార్య ఫణీంద్ర తెలియచేసినది దాశరధి క్రిష్ణమాచార్యుల గూర్చి.
  మీరు చదువుతున్నది క్రిష్ణమాచార్యుల వారి తమ్ముడు -
  దాశరధి రంగాచార్యుల "వచన వేదములు"..

  ReplyDelete
 7. రంజని గారు! నాకు దాశరధి క్రిష్ణమాచార్యుల గురించి అంతగా తెలియదు. సరిదిద్దినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు