తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, July 14, 2010

నేను నా భార్యను అంత ప్రేమగా చూడడం లేదేమో!

టపా పేరు చూసి నాకు భార్య ఉందని అనుకొనేరు. నేను ఇంకా బ్రహ్మచారినే. ఇక్కడ నా స్నేహితుడి విషయం లో జరిగిన సంఘటనను వ్రాస్తున్నాను.

సరే ఇక విషయానికి వస్తాను.

నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. పేరు చెప్పడం లేదు. ఆ అబ్బాయికి పెళ్ళై రెండేళ్ళు అవుతోంది. నా స్నేహితుడిది ప్రేమవివాహం. పెద్దలను ఒప్పించే చేసుకొన్నారు.ఇప్పుడు తన భార్య ఎనిమిదవ నెల గర్భవతి. ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఆ అమ్మాయి గర్భవతి అని రూఢి (pregnancy conform) అయినప్పుడు జరిగింది.
ఆ సమయంలో ఆ అమ్మాయి పుట్టింటికి ఏదో పని మీద వెళ్ళింది. అక్కడ ఒంట్లో నలతగా ఉంటే వైద్యుని వద్దకు వెళ్తే ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది. పక్కనే అమ్మాయి వాళ్ళ అమ్మ ఉండడం చేత వాళ్ళ అమ్మ కూడా సంతోషించింది. ఆ అమ్మాయి విషయం చెబుదామని నా స్నేహితునికి ఫోన్ చేయబోతోంది. ఇంతలో చెల్లి ఆసుపత్రికి వచ్చిందని తెల్సుకొన్న ఆ అమ్మాయి అన్నయ్యలు ఇద్దరూ ఏమయిందోనన్న అదుర్దా తో ఆసుపత్రికి వచ్చారు. విషయం వాళ్ళు కూడా తెల్సుకొని ఆనందపడ్డారు.నా మిత్రునికి ఫోన్ కలవడం లేదు. చాలాసేపు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు.

ఇంట్లో అమ్మాయి వాళ్ళ నాన్న కు విషయం తెల్సి ఆనందించి అల్లుడికి (నా మిత్రునికి) ఫోన్ చేస్తే ఫోన్ కలిసింది. విషయం చెప్తే నా స్నేహితుడు కూడా ఎంతో సంతోషం లో మునిగిపోయాడు.
తర్వాత అమ్మాయి కూడా వెంటనే వాళ్ళ నాన్న దగ్గరి నుండి ఫోన్ అందుకొని విషయం చెప్పింది.

ఫోన్ పెట్టేసిన తర్వాత పక్కనే ఉన్న మరో స్నేహితుడు ఊర్కే ఉండలేక " మొదట నీకు కదా చెప్పాలి. వారికి మొదట ఎందుకు చెప్పింది?" అంటూ ఏవేవో మాటలతో రెచ్చగొట్టాడు.
అందుకు వీడు "అలా ఏం ఉండదు. ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయినప్పుడు వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉందంట. అలా తెల్సుంటుంది" అన్నాడు.

అందరికీ ఫోన్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకొంటున్నాడు. అలానే అమ్మాయి అన్నయ్యలకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పబోతే వారు మాకు తెల్సు బావా! శుభాకాంక్షలు (congratulations) అన్నారు.

ఫోన్ పెట్టేసాక పక్కన ఉన్న స్నేహితుడు రెచ్చగొట్టే ధోరణి లో "చెప్పా కదా! మొదట మీఆవిడ నీకు చెప్పకుండా అందరికీ చెప్పేసింది" అన్నాడు. ఇలా అన్న స్నేహితుడే ఇంతకు ముందు వీరి పెళ్ళికి ఎంతో
సహాయపడ్డాడు. వీరు ప్రేమించుకొంటున్నప్పుడు చాలా సహాయంగా ఉన్నాడు. ఆ కృతజ్ఞత తో నా మిత్రుడు ఆ అబ్బాయి అలా అంటున్నా ఏమీ అనలేదు. లేకుంటే " నా సంసారం విషయం నీకెందుకు?" అంటూ క్లాస్ పీకేవాడు. కాని ఎంతో సహాయం చేసినందు వలన ఏమీ అనలేకపోయాడు. అతను రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఇంతకు ముందు ఆ అబ్బాయి అలా ఎప్పుడూ మాట్లాడలేదు. మొదటిసారిగా అలా మాట్లాడుతున్నాడు. తన భార్య గురించి తనకు బాగా తెల్సు. ఆ అబ్బాయినీ ఏం అనలేకపోతున్నాడు. కాని మనసులో కొద్దిగా ఇతనికీ బాధ కల్గింది.

అంతకు ముందు నాకు ప్రెగ్నెన్సీ విషయం చెప్పి ఆనందం పంచుకోవడానికి ఫోన్ చేసున్నాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి " రే సూరీ(సురేష్)! నేను తనను(అమ్మాయిని) అంత ప్రేమగా చూసుకోవడం లేదేమో.వాడు మాకు చాలా సహాయం చేసాడు కదా. ఇప్పుడు ఇలా ఎందుకు రెచ్చగొట్టేలా మాట్లాడాడు." అన్నాడు. అబ్బాయి గొంతులో బాధ కనిపించింది.

"ఎందుకురా! ఇప్పుడే కదా విషయం చెప్పి సంతోషించావ్. మళ్ళీ ఈ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుకు బాధపడుతున్నావ్?" అన్నాను. వాడు ఇంకో స్నేహితుడు అన్న విషయాలన్నీ నాకు చెప్పాడు.నేనేదో సర్దిచెప్పాననుకోండి.

తర్వాత అమ్మాయికి మామూలుగా ఫోన్ చేసాడు. కాని అప్పటికే అమ్మాయి కూడా మొదట తన భర్త( నా మిత్రుడు) కి విషయం చెప్పకపోయానే అనే బాధలో ఉంది. ఏడుస్తూ ఉంది.ఈ అబ్బాయి ఫోన్ చేసి ఎందుకు ఏడుస్తున్నావని అంటే బాధపడుతూ విషయం మొత్తం చెప్పి సారీ చెప్పింది.

తర్వాత ఈ అబ్బాయి కూడా ఇక్కడ జరిగిన విషయం ( నాకు ఫోన్ చేసిన విషయం కూడా) చెప్పేసాడు. మొదట అమ్మాయికి కోపం వచ్చినా ఆ అబ్బాయి నాతో అన్న మాట(నేను తనను(అమ్మాయిని) అంత ప్రేమగా చూసుకోవడం లేదేమో) తెల్సుకొని ఇలాంటి సున్నితమైన అంశాలలో కూడా ఇంత పాజిటివ్ గా ఆలోచించాడని చాలా సంతోషించింది.

ఇలా కథ సుఖాంతమయ్యింది.

నాకు అనిపించింది ఏమంటే భార్యాభర్తలు ఒకరి వలన ఒకరికి తెలిసో,తెలియకో బాధ కల్గినప్పుడు వీరిలా మనసు విప్పి అహం(Ego)లు లేకుండా మాట్లాడుకొంటే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి కదా అని.

ఇదండీ జరిగింది. అందరితో పంచుకోవాలనిపించింది. ఇలా బయట పెట్టాను.

4 comments:

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు